- సాంఘిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన దృశ్యాలు..
- సంఘటన స్థలానికి హుటా హుటిన కదిలిన రెవెన్యూ,పోలీస్ అధికారులు…
- మతిస్థిమితం లేని రహీం అనే వ్యక్తి వల్ల ఏర్పడిన అశాంతి వాతావరణం…
- స్పందించిన ముస్లిం పెద్దలు జిలాఫ్ ను అధికారులకు అప్పగింత…
- సద్దుమణిగిన వాతావరణం..
కబురు న్యూస్,నిజామాబాద్,డిసెంబర్ 31 :
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పురవస్తు శాఖ ఆధీనంలో ఉన్నటువంటి వంద స్తంభాల గుడి(ఇంద్ర నారాయణ వల్లభ ఆలయం)లో రహీం అనే మతిస్థిమితం లేని వ్యక్తి సమాధిపై జిలాఫ్ కప్పడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి సాంఘిక మాధ్యమాలలో దృశ్యాలు వైరల్ కావడంతో సంఘటన స్థలానికి హుటాహుటిన రెవెన్యూ,పోలీస్ అధికారులు చేరుకున్నారు. పూర్వం నుండి ఓ వర్గం వారు ఇంద్ర నారాయణ వల్లభ ఆలయంగా పరిగణిస్తూ వచ్చారు. మరో వర్గం వారు జుమా మసీదు (పత్తర్ మసీదుగా)భావిస్తూ వస్తున్నారు. కొన్ని సంవత్సరాల కాలంగా అక్కడి పూర్తి ప్రదేశాన్ని పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది.భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,మత ఘర్షణలకు తావివ్వకుండా శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగం వంద స్తంభాల గుడిని పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంది. వంద స్తంభాల గుడిలో ఎవరు కూడా పూజలు,నమాజులు చేయకుండా అధికారులు కట్టుదిట్టం చేశారు.
గతంలో బోధన్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కార్తికేయ మిశ్రా వంద స్తంభాల గుడిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించినా అది నెరవేరలేదు.ఇరు వర్గాలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఉత్పన్నం కాకూడదనే ఉద్దేశంతో అక్కడి ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటానికి జిల్లా అధికార యంత్రాంగం వెనకడుగు వేసింది. పూర్వం నుండి అక్కడ ఇరు వర్గాలు ఎలాంటి పూజలు పునస్కారాలు,నమాజులకు ఆ ప్రదేశం నోచుకోలేదు.శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పురవస్తు శాఖకు స్వాధీనపరిచింది. నాటినుండి అక్కడి ప్రదేశం మామూలుగా ప్రజలు వీక్షించటానికి మాత్రమే సందర్శిస్తూ ఉంటారు. రహీం అనే మతిస్థిమితం లేని వ్యక్తి గత కొంతకాలంగా ఆలయాల్లో గాని వంద స్తంభాల గుడికి సమీపాన ఉన్న జలాల్ బుఖారి దర్గా వద్ద గాని పలుమార్లు హల్చల్ సృష్టించాడని స్థానిక ముస్లిం పెద్దలు తెలిపారు. ముస్లిం మత పెద్దలైన మహమ్మద్ హజారుద్దీన్ అలియాస్ యూనూస్ పటేల్,షఫీ,కలీం తదితరులు కలగజేసుకొని,సంఘటన స్థలాన్ని పరిశీలించటానికి వచ్చిన రెవెన్యూ,పోలీస్ అధికారులకు సమాధిపై కప్పబడిన జిలాఫ్(బట్టను) తొలగించి అప్పగించారు. జిలాఫ్ ను తొలగించి అప్పగించడంతో వారిని అధికారులు అభినందించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలను బందోబస్తుగా ఏర్పాటు చేశారు.ఈ సంఘటనతో ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం శాంతియుతంగా మారడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
