సమస్య చెబుతుంటే,ఏంది నస అనుకునే ఈ రోజుల్లో కలెక్టర్ వినూత్న ప్రయత్నం…
ఓపికగా అర్జీలు రాస్తూ,అన్నం పెడుతున్న కలెక్టర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు..
అర్జీదారులారా..అన్నం తిని వెళ్ళండి..
కలెక్టర్ తమీమ్ అన్సారియా.
కబురు న్యూస్,ప్రకాశం జిల్లా,మార్చి 18 :
సమస్యల పరిష్కారంతో పాటు కడుపునింపుకోండంటూ ప్రకాశంజిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మీ కోసం కార్యక్రమంలో వినూత్నరీతిలో భోజన సదుపాయం కల్పించారు.ప్రతి సోమవారం సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయానికి వచ్చే అర్జీదారులకు భోజనం చేసే వెసులుబాటు కల్పించారు.అర్జీదారుల సమస్యలు విని,భరోసా ఇచ్చి,అన్నం పెట్టి పంపిస్తున్నారు.ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం ‘మీకోసం’ అదే స్ఫూర్తితో జిల్లాలో దీనిని మరింత ముందుకు తీసుకువెళ్తున్నారు.అర్జీల పరిష్కారంతోపాటు అర్జీదారులతో వ్యవహరించే తీరుపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఇప్పటికే ప్రతి సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు రాగిజావ,ఇతర స్నాక్స్ అందిస్తున్నారు అధికారులు. ఇప్పుడు భోజనం పెట్టేలా ఏర్పాట్లు చేశారు.వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి వస్తున్న అర్జీదారులకు సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇస్తున్నారు.కలెక్టరేట్ ప్రాంగణంలోకి ప్రవేశించిన వారికి “ మీ సమస్య చెప్పండి.అర్జీ రాస్తాం” అంటూ వారిని కూర్చోబెట్టి మాట్లాడటం దగ్గర నుంచి సంబంధిత శాఖ ఉన్నతాధికారుల దగ్గరకు,తరువాత కలెక్టరు దగ్గరకు వారిని తీసుకు వెళ్లేలా ప్రత్యేక సిబ్బందిని నియమించారు.ఇందులో భాగంగా వారి వంతు వచ్చే వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్ లో కూర్చోబెట్టి మంచి నీరు,బిస్కెట్లు,రాగిజావ వంటివి అందిస్తున్నారు.అయితే సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వస్తున్న ప్రజలు ఆకలితో ఇబ్బంది పడకుండా వీటికి అదనంగా మంచి భోజనం పెట్టించాలని కలెక్టరు నిర్ణయం తీసుకున్నారు.ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న కలెక్టర్,వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చి పంపిస్తున్నారు.మీ కోసం కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతున్న సందర్భాలు ఉన్నాయి.ఈ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అర్జీదార్లకు భోజనం పెట్టేలా అన్న క్యాంటీన్ నిర్వాహకులతో చర్చించారు.సోమవారం నుంచి అర్జీదారులకు కలెక్టరేట్ లో భోజన సదుపాయాన్ని కల్పించారు.కలెక్టర్ తమీమ్ అన్సారియాతో పాటు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ,డిఆర్‌వో చిన ఓబులేసు స్వయంగా అర్జీదారులకు భోజనం వడ్డించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రతి సోమవారం 500 మందికి భోజనం పెట్టేలా చర్యలు చేపట్టారు.కలెక్టరు తీసుకున్న ఈ నిర్ణయంపై అర్జీదారులు,ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
