నీ పిట్ట బెదిరింపులకు భయపడం
సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఫైర్…
తెలంగాణ మహిళలు ఎప్పటికీ పేదగానే ఉండాలా?…
హస్తం గుర్తు తల్లిని ఆమోదించేది లేదు…
తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం…
హైదరాబాద్, డిసెంబర్ 10(కబురు న్యూస్) :
సీఎం రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులకు ఎవరూ భయపడరని,గ్రాండ్‌గా ఉండే తెలంగాణ తల్లిని తీసి బీద తల్లిని పెట్టామని గొప్పలు చెప్తున్నాడని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.తెలంగాణ మహిళలు ఎప్పటికీ పేదవారిగానే ఉండాలా అని ప్రశ్నించారు.ఉద్యమ తల్లే తమ తల్లి అని, హస్తం గుర్తు తల్లిని ఆమోదించేది లేదని తెలిపారు.తెలంగాణ తల్లి విగ్రహం మార్పునకు నిరసనగా మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ,ఉద్యమకారులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.తెలంగాణ ప్రత్యేకమే బతుకమ్మ అని,అలాంటిది తెలంగాణ తల్లి చేతి నుంచి బతుకమ్మను తొలగించడం హేయమైన చర్యగా అభివర్ణించారు.మహిళలకేమో విగ్రహాలు.. మగవాళ్లకేమో వరాలా అని ప్రశ్నించారు.తెలంగాణ తల్లిని మార్చి కాంగ్రెస్ తల్లిని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు.తొమ్మిది మంది తెలంగాణ కవులు, కళాకారులకు స్థలాలు, డబ్బులిస్తామన్నారు, ఆ గుర్తింపునకు మల్లు స్వరాజ్యం,విమలక్క, సంధ్య పనికిరారా అని ప్రశ్నించారు.మీ నోటి నుంచి ఎరుకల నాంచారమ్మ, బీడీ కార్మికుల మహిళల పేరు ఎందుకు రాలేదని సీఎంని ప్రశ్నించారు.విగ్రహం పెట్టామని చెప్పి సామన్య మహిళలకు ఇచ్చిన హామీలను ఎగ్గొడతారా అని నిలదీశారు.
