కాకతీయ విద్యాసంస్థల్లో విద్యార్థి మృతి..
యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమన్న కుటుంబ సభ్యులు..
తమ నిర్లక్ష్యం లేదన్న యాజమాన్యం..
దర్యాప్తు చేపట్టిన పోలీసులు..
మా బిడ్డల పరిస్థితెందోనని భయాందోళనకు గురవుతున్న తల్లిదండ్రులు..
కబురు న్యూస్,నిజామాబాద్,డిసెంబర్ 01 :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు పాఠశాల హాస్టల్లల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లి దండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నగరంలోని కాకతీయ విద్యాసంస్థలో తొమ్మిదవ తరగతి చదువుతున్న బోధన్ కు చెందిన విద్యార్థి జశ్విత్ రెడ్డి (14) శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ సంఘటన జరిగినప్పటి నుండి మిగతా పిల్లల తల్లి దండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.మా పిల్లల పరిస్థితేందని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.ఎంతో నమ్మకంగా విద్యాసంస్థలు పట్ల విశ్వాసంతో పిల్లలు చదివి బాగుపడతారని వసతి గృహాల్లో చేర్చితే ఇలాంటి సంఘటనలు జరగటం దురదృష్టమని వాపోతున్నారు.విద్యాసంస్థల యాజమాన్యం చదువుల పేరుతో విద్యార్థుల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.బడికి పంపిన విద్యార్థి ఇంటికి తిరిగి వస్తాడో రాడో అనే భయాందోళనకు గురవుతున్నారు.ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఇందుకు సాక్షాలుగా నిలవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హడలెత్తిపోతున్నారు.ప్రైవేట్ కార్పొరేటు విద్యాసంస్థల్లో చదివిస్తే తమ కొడుకు భవిష్యత్తు బంగారు మయం అవుతుందని అనుకున్నకుంటున్న తల్లిదండ్రుల కల కలగానే మిగులుపోతుందిత.లక్షలు వెచ్చించి విద్యార్థిని చదివిస్తే చివరకు విద్యార్థి ప్రాణాలు గాల్లో కలసిపోవడంతో ఆ తల్లిదండ్రులు తీరని శోకసంద్రంలో మునిగిపోతున్నారు.
పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణం..
పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే విద్యార్థి మృతికి కారణమని మృతుడి తండ్రి భాస్కర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.బాబుకు జ్వరంగా సరైన సమయంలో చికిత్స అందించకుండా నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు.గురువారం బాబు అనారోగ్యం పాలైతే,శుక్రవారం ఉదయం 9 గంటలకు యాజమాన్యం తమకు సమాచారం అందించి,బాబు పరిస్థితి విషమంగా ఉందని తెలపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చేసరికి బాబు మూడవ అంతస్తులో నుండి దిగుతూ తమ కళ్ళముందే స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు.పూర్తిగా పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే జశ్విత్ రెడ్డి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.దర్యాప్తు చేపట్టాలంటూ నాలుగవ టౌన్ లో ఫిర్యాదు చేయగా,మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని నాలుగవ టౌన్ పోలీసులు వెల్లడించారు.
ఆలస్యంగా స్పందించిన యాజమాన్యం..
శివ జశ్విత్ రెడ్డి విద్యార్థి చనిపోయిన మూడు రోజులకు యాజమాన్యం ఆలస్యంగా స్పందించడం పలు అనుమానాలకు తావిస్తోంది.తమ విద్యా సంస్థల నిర్లక్ష్యం ఏమీ లేదని,విద్యార్థి మృతి బాధాకరమని కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ రజనీకాంత్ తెలిపారు.ఆదివారం మధ్యాహ్నం పాఠశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు.తమ విద్యాసంస్థలో చదివే పిల్లలకు విద్యతోపాటు,యోగక్షేమల గురించి మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకొచ్చారు.విద్యార్థి ముందు రోజు కూడా ఉత్సాహంగా పాఠశాలలో తిరిగాడని,వాలీబాల్ కూడా ఆడాడని అన్నారు.ముందు రోజు వాంతులు రావడంతో తమ వార్డెన్ ప్రథమ చికిత్స చేయించారాన్నారు.మృతి చెందిన రోజు కూడా తమ సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లడానికి పలకరించగా,తల్లిదండ్రులు వచ్చిన తర్వాతే వెళ్తానని విద్యార్థి చెప్పాడని మీడియాకు తెలిపారు. విద్యార్థి తల్లిదండ్రులు వచ్చాక వారి కారులోనే హాస్పిటల్ కి తీసుకెళ్లామని,హాస్పిటల్లో మృతి చెందినట్లు తెలిపారు.రెండు రోజులుగా విద్యార్థి పాఠశాలలో ఉన్న సమయంలో జరిగిన పరిణామలపై పూర్తి సీసీ ఫుటేజ్ ను మీడియాకు విడుదల చేశారు. ఇందులో యాజమాన్యం నిర్లక్ష్యం ఎక్కడ కూడా లేదని వెల్లడించారు..
గతంలోనూ ఓ విద్యార్థి ఆత్మహత్య…
గతంలో కాకతీయ విద్యా సంస్థల్లో ఇంటర్ చదువుతున్న ఆర్మూర్ కు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కళాశాల మూడవ అంతస్తుపై నుంచి దూకి బలవన్మరణం చెందాడు.విద్యార్థి మృతి పట్ల కుటుంబ సభ్యులు,విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు.ఇలా కాకతీయ విద్యా సంస్థలో విద్యార్థుల మరణాల పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ర్యాంకుల పేరుతో విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థులకు మానసిక ఒత్తిడిలకు గురి చేస్తుందంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పాఠశాలలో నిబంధనల పేరుతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.విద్యార్థుల మరణాలపై విద్యాశాఖ విచారణ చేపట్టాలని కోరుతున్నారు.
యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలి..
విద్యార్థి మృతికి కారణమైన కాకతీయ విద్యాసంస్థల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పి.డి.ఎస్.యూ జిల్లా అధ్యక్షుడు గౌతం కుమార్ డిమాండ్ చేశారు.కాకతీయ విద్యాసంస్థల్లో గత మూడు రోజుల క్రితం జశ్వంత్ రెడ్డి తొమ్మిదవ తరగతి విద్యార్థి మృతి చెందటం బాధాకరమన్నారు.మృతికి కారణమైన కాకతీయ విద్యాసంస్థల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకొని విద్యాసంస్థ గుర్తింపు రద్దు చేయాలన్నారు.విద్యార్థి మూడు రోజుల నుండి అనారోగ్యంతో ఉన్నా సంబంధిత వార్డెన్ పట్టించుకోకుండా విద్యార్థి పట్ల దురుసుగా ప్రవర్తించాడని ఆగ్రహించారు.
హాస్టల్లో వసతుల కరువు..
కాకతీయ విద్యా సంస్థల్లోని హాస్టల్లో సరైన సౌకర్యాలు భోజన వసతులు లేవని టీజీవిపి జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ పేర్కొన్నారు.యాజమాన్యం కేవలం లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.విద్యార్థి మృతి చెందిన తర్వాత యాజమాన్యం హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించకపోవడం సిగ్గుచేటన్నారు.తప్పు చేయకపోతే విద్యార్థిని ఎందుకు దొంగ చాటున తల్లిదండ్రులకు అప్పగించారని ప్రశ్నించారు.ప్రశ్నించేందుకు వెళ్తే విద్యార్థి సంఘాలను సైతం పోలీసులచే నిర్బంధించారని అన్నారు.విద్యార్థి కుటుంబానికి 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలన్నారు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ,జిల్లా కలెక్టర్ స్పందించి మృతి చెందిన జశ్విత్ రెడ్డి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
