మీ కూతురు కిడ్నాప్ అంటూ ఫోన్ కాల్..
భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు..
నగరంలో వెలుగులోకి వచ్చిన ఘటన…
నిజామాబాద్ జిల్లాలో ఫేక్ పోలీసుల మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వరుస ఘటనలతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసుల మంటూ ఫోన్ చేసి, మీ కుటుంబ సభ్యులు ఓ కేసులో ఇరుకున్నారు, డబ్బులు ఇస్తే వదిలేస్తాం అంటూ రోజు ఎక్కడో ఒక చోట కాల్స్ వస్తూనే ఉన్నాయి. దీంతో పిల్లలను ఇంటి నుండి బయటకు పంపాలంటే కుటుంబ సభ్యులు, ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా మంగళవారం మరో ఘటన వెలుగుచూసింది. నగరంలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన ఓ యువతి ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. ఈరోజు మధ్యాహ్నం కళాశాలకు యువతి వెళ్ళింది. అదే సమయంలో సైబర్ నేరగాళ్లు, యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, మీ అమ్మాయిని కిడ్నాప్ చేసి, ఢిల్లీకి తీసుకు వెళ్తున్నామని చెప్పారు. దీంతో కంగుతిన్న యువతి కుటుంబ సభ్యులు హుటహుటిన కళాశాలకు వెళ్లారు. యువతి కళాశాలలో ఉండటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇది సైబర్ నేరగాళ్ల పనేనని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
